Sunday, 18 February 2018

Rotomac Pens Owner Allegedly Missing With ₹800 Crore From Govt. Banks

పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌లో భారీ కుంభకోణం మరవకుముందే అలాంటి తరహా మోసం మరొకటి వెలుగులోకి వచ్చింది. పీఎన్‌బీకి చెందిన ముంబయి శాఖలో రూ.11 వేలకోట్లకు పైగా అక్రమాలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు పలు ప్రభుత్వరంగ బ్యాంకుల్లో కూడా మిలియన్‌ డాలర్ల కుంభకోణం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ రొటొమాక్‌ పెన్నుల కంపెనీ మాతృసంస్థ భారత్‌లోని వివిధ బ్యాంకుల్లో రూ.800 కోట్ల రుణాలు తీసుకొని ఎగనామం పెట్టినట్లు సమాచారం.
రొటొమాక్‌ కంపెనీ యజమాని అయిన విక్రమ్‌ కొఠారి ఐదు బ్యాంకుల్లో రూ.800 కోట్లకుపైగా రుణాలు తీసుకున్నట్లు సమాచారం. అలహాబాద్‌ బ్యాంకు, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంకు, యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా బ్యాంకులు పలు నియమాలను ఉల్లంఘించి కొఠారికి అప్పులు ఇచ్చినట్లు తెలుస్తోంది. కొఠారి యూనియన్‌ బ్యాంకు నుంచి రూ.485 కోట్లు, అలహాబాద్‌ నుంచి రూ.352 కోట్ల రుణం తీసుకున్నారు. అయితే ఆయన ఇప్పటివరకూ అసలును కానీ, వడ్డీని కానీ బ్యాంకులకు తిరిగి చెల్లించనట్లు తెలుస్తోంది.

కాన్పూరులోని కొఠారి కార్యాలయం కూడా గత కొన్ని వారాలుగా మూతపడి ఉంది. ఆయన కూడా కనిపించకపోవడం మరిన్ని ఊహాగానాలకు తావిస్తోంది. మరోవైపు ఈ ఘటనపై అలహాబాద్‌ బ్యాంకు మేనేజర్‌ స్పందిస్తూ.. కొఠారి ఆస్తులు అమ్మి సొమ్మును రికవరీ చేస్తామని తెలిపారు. ప్రముఖ వజ్రాల వ్యాపారి నీరవ్‌ మోదీ పీఎన్‌బీని మోసగించి రూ.11,400 కోట్లు అప్పుగా తీసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటన ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇప్పుడు ఈ రొటొమాక్‌ వ్యవహారం ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో వేచి చూడాలి.

No comments:

Post a Comment

Please Enter your comments here